Andhra Pradesh: కృష్ణపట్నం పోర్టు పరిధిలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.. నెల్లూరు జిల్లాలో 3 గ్రామాల తరలింపుకు నిర్ణయం!

  • కృష్ణపట్నం పోర్టు పరిధిలో గ్రామాల తరలింపు
  • విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిర్ణయం
  • అదనంగా నిధులు డిపాజిట్ చేయడానికి కంపెనీల అంగీకారం
  • 36 ఇళ్లకు అదనంగా రూ.3 లక్షల చొప్పున చెల్లింపు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పరిధిలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి మూడు గ్రామాలను తరలించాలని విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట రావు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి నిర్ణయించారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని విద్యుత్ శాఖ మంత్రి పేషీలోని సమావేశ మందిరంలో ఈరోజు సంబంధిత అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. నూలటూరుపాడు, నేలటూరుపాలెం, ఎస్సీ కాలనీలను తరలించాలని వివరించారు.

అందుకోసం అదనంగా డిపాజిట్ చేయడానికి జెన్ కో, ఎన్‌సీసీ, ఎన్పీసీఐఎల్ (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రతినిధులు అంగీకరించారు. టెండర్లు పిలిచేంతవరకు అక్కడ నివసించే కుటుంబాలకు నెలకు రూ.2500లు, 30 కిలోల బియ్యం ఇవ్వడానికి కూడా వారు అంగీకారం తెలిపారు. నక్కల మిట్టలోని 36 ఇళ్లకు ఒక్కోదానికి అదనంగా రూ.3 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు.

కంపెనీలు తమ లాభాలలో సీఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ) ఫండ్ 2 శాతం కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని నిర్ణయించాయి. కంపెనీల చట్టం ప్రకారం కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు, సీఎస్ఆర్ డిపాజిట్ చేయడానికి కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కంపెనీల ప్రతినిధులకు చెప్పారు.

కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుని మంత్రులు ఆదేశించారు. అందుకు ఒక కమిటీని నియమించి చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఏపీపీడీసీఎల్ఎస్ఈ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖల జెడీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఆ కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.

చివరగా మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ... పరిశ్రమలను ప్రోత్సహించాలన్నది తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. పరిశ్రమలు రావడానికి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని, అయితే పరిశ్రమలు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News