nara lokesh: ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లం: నారా లోకేష్

  • ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
  • అవినీతి ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలను చూపించాలి
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు

లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశం ఉందంటూ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే, తాము మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఐదేళ్లు పాలించాలంటూ ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారు... వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించాలని లోకేష్ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని... లోపల వేసేస్తామని హెచ్చరించారు. ఐటీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వైయస్ హయాంలో కుప్పంకు ఒక్క మీటరు రోడ్డు కూడా వేయలేదని... కానీ, తాము మాత్రం పులివెందులకు రోడ్డు వేశామని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో నిరుద్యోగ భృతికి తుది రూపు ఇస్తామని తెలిపారు.  

  • Loading...

More Telugu News