kanimozhi: సీఎం రమేష్ ను కలిసి మద్దతు ప్రకటించిన కనిమొళి.. కేంద్రంపై ధ్వజం
- కడప దీక్షాస్థలికి వచ్చిన కనిమొళి
- ఏపీ పోరాటానికి మా మద్దతు ఉంటుందంటూ ప్రకటన
- రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందంటూ విమర్శ
కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్షకు దిగిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలకు మద్దతు పెరుగుతోంది. సొంత రాష్ట్రం నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాల నేతల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఈ రోజు కడపకు వచ్చి, దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ, ఏపీ హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో సీఎం రమేష్ పోరాడారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంటే... ఈ పాటికి విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరేవని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు. హిందుత్వం తప్ప బీజేపీకి మరేదీ పట్టదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.