Telangana: తెలంగాణ రేషన్ దుకాణాల డీలర్ల సమ్మె పిలుపు.. పౌర సరఫరాల శాఖ హెచ్చరిక
- రేషన్ డీలర్లు సమ్మె చేయడం పూర్తిగా చట్ట వ్యతిరేకం
- నిత్యావసరాలను అందించాలి
- ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం మాకు ఉంది
తెలంగాణ సర్కారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెల 1 నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పందించింది. పేదలకు నిత్యావసరాలు అందించడం సామాజిక బాధ్యతని పేర్కొంది. రేషన్ డీలర్లు సమ్మె చేయడం పూర్తిగా చట్ట వ్యతిరేకమని, చౌకధర దుకాణాల్లో నిత్యావసరాలను అందించాల్సిందేనని ఆదేశించింది. సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం తమకు ఉందని చెప్పింది. కాగా, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు.