janasena: సీఎం రమేష్, బీటెక్ రవిల ఆమరణదీక్షపై జనసేన విమర్శలు

  • టీడీపీ నేతల దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయి
  • రాష్ట్రం కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోంది
  • ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పవన్ ను ఎంతో వేధించింది

కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని జనసేన విమర్శించింది. కేంద్రంలో అధికారం పంచుకున్నంత కాలం కడప ఉక్కు విషయాన్ని తెలుగు దేశం ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పుబట్టింది. ఇప్పుడు చేస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి లేదని తెలిపింది. ఈ ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నేత శ్రీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ, కడప ఉక్కు సాధన కోసం ఈ నెల 29న అఖిలపక్షం చేపట్టే రాష్ట్ర బంద్ కు జనసేన మద్దతు ఇస్తుందని తెలిపారు. పార్టీ శ్రేణులు బంద్ లో పాలుపంచుకొంటాయని చెప్పారు.

దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి... ఆసుపత్రికి తరలించమంటారా? అని అడుగుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలమని మాదాసు ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. కేంద్రం కూడా ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం... విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐరన్ ఓర్ గనులను కూడా కేటాయించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం పట్ల బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్ర 28వ తేదీన మళ్లీ ప్రారంభమవుతుందని మాదాసు తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పవన్ కల్యాణ్ ను ఎంతో వేధించిందని చెప్పారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను నిర్లక్ష్యం చేస్తే జనసేన తప్పకుండా ప్రశ్నిస్తుందని... అమరావతితోపాటు అన్ని ప్రాంతాలనూ సమాన అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

janasena
kadapa
steel plant
pawan kalyan
Chandrababu
  • Loading...

More Telugu News