Chandrababu: బీటెక్ రవి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: చంద్రబాబు
- అవినీతిపరులంతా ఒకవైపు చేరారు
- కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకులా మారారు
- స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు ఉద్ధృతం చేయండి
కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవిలు ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులను కట్టడి చేయలేని స్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు. అక్రమార్కులంతా ఒకవైపు చేరారని దుయ్యబట్టారు. ఉక్కు కర్మాగారం అంశంలో గాలి జనార్దనరెడ్డి బృందం నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి అద్దె మైకులా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ-వైసీపీల దొంగ నాటకాలను బయటపెట్టాలని, గాలి-బీజేపీ-జగన్ ల లూలూచీని ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఢిల్లీలో కలిసిన వైనాన్ని ఎండగట్టాలని చెప్పారు. తిరుమల వెంకన్న ప్రతిష్ట దిగజారేలా రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. శ్రీవారి నగలను ప్రదర్శనకు పెట్టడం మంచిది కాదని అర్చకులు చెబుతున్నారని తెలిపారు.