jio: 'జియో లింక్' పేరుతో కొత్త సేవలను ప్రారంభించిన జియో.. 90 రోజులు ఫ్రీ
- ఇండోర్ వైఫై హాట్ స్పాట్ సేవల కోసం జియో లింక్
- హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి
- దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సేవలు ప్రారంభం
టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జియో... తన వినియోగదారుల కోసం సరికొత్త సేవలను తీసుకురాబోతోంది. జియో లింక్ పేరుతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సేవలను ప్రారంభించింది. దశల వారీగా ఈ సేవలు దేశ వ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నాయి.
మాల్స్, హోటళ్లు, కార్యాలయాలు, అపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాల్లో జియో లింక్ 'ఇండోర్ వైఫై హాట్ స్పాట్'గా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ లో భాగంగా రూ. 2,500తో సెట్ టాప్ బాక్సును పోలి ఉండే ఒక చిన్న పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శాటిలైట్ డిష్ లాంటి ఒక చిన్న పరికరాన్ని భవనం పైభాగంలో అమర్చి, కేబుల్ ద్వారా భవనంలోని రూటర్ కు కలుపుతారు. దీని ద్వారా హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక భవనంలోని అందరూ దీని ద్వారా ఒకేసారి సేవలు పొందచ్చు.
తొలి 90 రోజుల వరకు ఈ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత రూ. 699తో రోజుకు 5జీబీ డేటా వంతున 28 రోజుల వరకు... రూ. 2,099తో రోజుకు 5జీబీ డేటా వంతున 98 రోజుల వరకు సేవలను పొందవచ్చు. రూ. 4,199తో 196 రోజుల వరకు డేటా పొందే వీలుంటుంది. అయితే, దీని ద్వారా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.