Narendra Modi: ప్రధానికి ప్రాణాపాయం... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
- మోదీ ప్రాణాలు తీసేందుకు విద్రోహశక్తుల ప్రణాళికలు
- మంత్రులు, అధికారులైనా ఎస్పీజీ అనుమతితోనే ఆయన వద్దకు
- కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు
అన్ని రాష్ట్రాలనూ చుట్టేస్తూ ప్రజలతో మమేకమై, రోడ్ షోలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీకి, గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదం పొంచివుందని, ఆయన ప్రాణాలు తీసేందుకు విద్రోహశక్తులు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్ర హోమ్ శాఖ నుంచి మోదీ పర్యటనల వేళ, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కొత్త నిబంధనలు వెళ్లాయి. వీటి ప్రకారం, మంత్రులు, అధికారులు అయినా సరే ఆయన ప్రత్యేక భద్రతా విభాగం నుంచి క్లియరెన్స్ లేకుండా మోదీ వద్దకు వెళ్లలేరు.
2019లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా మోదీ, దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వారి నుంచి ఆయనకు ప్రమాదం ఉందని, హోమ్ శాఖ అన్ని రాష్ట్రాలకూ పంపిన లేఖలో పేర్కొంది. మోదీ దగ్గరకు ఎవరూ వెళ్లకుండా చూసుకోవాలని, దీన్ని ప్రథమ నిబంధనగా ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్రాల బీజేపీ చీఫ్ లకు కూడా తెలిపింది. ఆయన భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అనుమతితోనే అధికారులు, నేతలు ఆయన వద్దకు వెళ్లాలని తెలిపింది.