USA: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కృష్ణా జిల్లా అమ్మాయి.. ఆమె గెలుపు ఖాయమంటున్న సర్వేలు!
- కాంగ్రెస్ లో అడుగు పెట్టనున్న రెండో భారతీయ మహిళ?
- మేరీల్యాండ్ సిక్త్స్ డిస్ట్రిక్ట్ ప్రైమరీకి పోటీ పడుతున్న అరుణ
- ఆమె విజయం ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్
కృష్ణా జిల్లాకు చెందిన అరుణా మిల్లర్ అమెరికా కాంగ్రెస్ లో రెండో భారతీయ మహిళగా అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. మేరీల్యాండ్ లోని డెమోక్రాట్ల కంచుకోటగా ఉన్న సిక్త్స్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడుతున్న ఆమె, తన ప్రత్యర్థి డేవిడ్ ట్రోన్ పై విజయం సాధించడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. ఓ సంపన్న వ్యాపారవేత్త అయిన ట్రోన్ ఈ ఎన్నికల్లో విజయం కోసం రూ. 65 కోట్లు ఖర్చు పెడుతుండగా, అరుణ కేవలం రూ. 9 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఆమె విజయం సాధించనుండటం ఖాయమేనని తెలుస్తోంది.
కృష్ణా జిల్లా వాసి కాట్రగడ్డ వెంకట రామారావుకు ఐబీఎంలో ఉద్యోగం రావడంతో 1972లోనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అప్పుడు అరుణ వయసు ఏడేళ్లు. అక్కడే చదువుకుంటూ పెరిగిన అరుణ, న్యూయార్క్ లో హైస్కూలు విద్యాభ్యాసాన్ని, మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. కాలేజీలో తాను లవ్ చేసిన డేవిడ్ మిల్లర్ ను 1990లో వివాహం చేసుకున్నారు. 2004లో డెమోక్రటిక్ పార్టీలో చేరిన ఆమె అంచెలంచలుగా ఎదుగుతూ, ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆమె విజయం ఖాయమేనని అమెరికన్ పత్రికలు రాస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితం నేడు వెల్లడి కానుంది.