Kadapa: దీక్షను విరమించకుంటే ప్రమాదం: సీఎం రమేష్ తో డాక్టర్లు
- ఆరో రోజుకు చేరిన దీక్ష
- బరువు తగ్గుతున్నారన్న డాక్టర్లు
- ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడి
కడప స్టీల్ ప్లాంట్ కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమరణ దీక్షకు దిగిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆయన వెంటనే దీక్షను విరమించాలని ఈ ఉదయం వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సూచించారు. రమేష్ దీక్ష నేటితో ఆరో రోజుకు చేరుకోగా, ఆయన బరువు తగ్గడం ప్రారంభమైందని, షుగర్ లెవల్స్ బాగా తగ్గాయని, దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ బీటెక్ రవి పరిస్థితి కూడా అలాగే ఉందని రిమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఇద్దరూ చాలా నీరసంగా ఉన్నారని చెప్పిన డాక్టర్లు, ఉన్నతాధికారులకు వెంటనే తమ నివేదికను పంపించనున్నట్టు తెలిపారు. వీరు ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే దీక్ష ప్రభావం శరీరంలోని అవయవాలపై పడుతుందని అన్నారు. కాగా, కడప స్టీల్ ప్లాంటుపై కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, వెంటనే ప్లాంటును మంజూరు చేయాలని, అప్పటివరకూ తన దీక్ష కొనసాగుతుందని సీఎం రమేష్ వెల్లడించారు.