Pawan Kalyan: రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు.. ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నది టీడీపీనే!: పవన్
- పరిశ్రమల స్థాపన కోసం కమీషన్లు అడుగుతున్నారు
- ఇదే కొనసాగితే యువతలో అశాంతి ఖాయం
- ‘ఉక్కు’ కోసం 29న రాష్ట్ర బంద్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీపై మరోమారు విరుచుకుపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఒకప్పుడు అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు దాని కోసం గోలగోల చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించానని, గత ఎన్నికల్లో టీడీపీకి అందుకే మద్దతు ఇచ్చానని తెలిపారు. అయితే, హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం కావడంతో బయటకు వచ్చానన్నారు.
ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి, యువతలో అశాంతి నెలకొంటుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చే వారిని కమీషన్లు అడుగుతున్నట్టు విదేశాల్లో కొందరు తనతో చెప్పారని అన్నారు.
ఉక్కు పరిశ్రమ కోసం ఈ నెల 29న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు ఇస్తుందని పవన్ ప్రకటించారు. వామపక్షాలదీ తమదీ ఒకే భావజాలమని, సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయని తెలిపారు. కాగా, ఆదివారం పవన్‌తో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు.