kcr: వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని సర్వేలు చెబుతున్నాయి: సీఎం కేసీఆర్
- నన్ను గద్దె దించడమే కర్తవ్యమని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు
- వాళ్లు గెలిస్తే ఏం చేస్తారో చెప్పరు.. నన్ను మాత్రం గద్దె దింపుతారట
- ఏ ఎన్నికలు వచ్చినా, టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తున్నారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని సర్వేలు చెబుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దానం నాగేందర్ కు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 50 వేల కంటే ఎక్కువ మెజార్టీలతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం ఎన్నికల సంఘాన్ని అడుగుదామనుకుంటున్నానని, గత వారం ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఈ అంశంపై చర్చించామని, ఎన్నికలకు వెళితే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే కర్తవ్యమని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారని, వాళ్లు గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. తనను మాత్రం గద్దె దింపుతామంటున్నారని విమర్శించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించామని, ఏ ఎన్నికలు వచ్చినా, టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో ప్రధాన అంశం సాగునీరు అని, 2020 జూన్ లో ఎటువెళ్లినా ఆకుపచ్చ తెలంగాణనే కనిపిస్తుందని, లక్ష కోట్ల రూపాయల పంట పండనుందని అన్నారు. దేశంలో ధనికులైన యాదవులు, మత్స్యకారులు మన దగ్గరే ఉన్నారని, అనేక రంగాల్లో చక్కని పద్ధతుల్లో ముందుకెళ్తున్నామని, కేవలం రాజకీయంగా మాట్లాడే శక్తులే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ దివాళా తీసిందని, అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. గత పాలకులు రైతులు, ప్రజలను ముప్పై ఏళ్లు బాధపెట్టారని, ఇప్పుడు తాము చేసిన పనిని గత పాలకులు ఎందుకు చేయలేదని అన్నారు.