New Delhi: ఢిల్లీ వాసులను బెంబేలెత్తించిన ఎండలు
- 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- నేడు కూడా అధిక ఎండలే
- ఇంకా పూర్తిగా విస్తరించని రుతుపవనాలు
నైరుతి రుతుపవన కాలం ప్రారంభమైన తర్వాత ఢిల్లీ వాసులు శనివారం ప్రచండ భానుడి ప్రతాపానికి ఇబ్బంది పడ్డారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు నిన్న అనూహ్యంగా 44.8 డిగ్రీలకు చేరాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాలమ్ లో 44.8 డిగ్రీల సెల్సియస్, రిడ్జ్ లో 43.8 డిగ్రీలు, అయనగర్ లో 43.6 డిగ్రీలు, లోధి రోడ్డులో 42.6 డిగ్రీలు, సఫ్దర్ జంగ్ లో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నట్టు రికార్డు అయింది. కనీస ఉష్ణోగ్రతగా 30 డిగ్రీలు నమోదైంది. ఈ రోజు కూడా 31-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది. రుతుపవనాలు బలంగా లేకపోవడం, ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించకపోవడంతో ఉత్తరాదిన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.