Jammu And Kashmir: అడ్డదిడ్డంగా రాస్తే బుఖారీకి పట్టిన గతే..: జర్నలిస్టులను హెచ్చరించిన బీజేపీ ఎమ్మెల్యే
- జర్నలిస్టులు తప్పుడు వాతావరణాన్ని సృష్టించారు
- హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలి
- జమ్మూ కశ్మీర్ మాజీ మంత్రి లాల్ సింగ్
జమ్మూ కశ్మీర్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డదిడ్డంగా రాతలు రాస్తే, షుజ్జత్ బుఖారీకి పట్టిన గతే పడుతుందని మెహబూబా ముఫ్తీ సర్కారులో మంత్రిగా పని చేసిన బీజేపీ ఎమ్మెల్యే లాల్ సింగ్ హెచ్చరించారు.
"కశ్మీర్ లో జర్నలిస్టులు ఓ తప్పుడు వాతావరణాన్ని సృష్టించారు. మీ హద్దులు మీరే నిర్ణయించుకోవాలని నేను కోరుతున్నా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. జాగ్రత్త పడండి. షుజ్జత్ బుఖారీలా జీవించాలని భావిస్తే మీ ఇష్టం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ ప్రస్తావించారు. జర్నలిస్టులకు స్వాతంత్రం ఉందని, అయితే అది జాతిని, జాతీయతా భావాన్ని పణంగా పెట్టేలా మాత్రం ఉండబోదని లాల్ సింగ్ అన్నారు.