Pawan Kalyan: నా మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు: పవన్ కల్యాణ్
- రాజకీయాలను సిద్దాంతాల పరంగానే చూస్తా
- వ్యక్తిగత కోణంలో రాజకీయాలను చూడను
- ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలు అడగడం మర్యాద
గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిన్న విగ్రహప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానందస్వామి సమక్షంలో ఇద్దరూ మాట్లాడుకున్నారు. గత కొంత కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయింది. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
తన మర్యాదను అపార్థం చేసుకోవద్దని పవన్ అన్నారు. "రాజకీయ విభేదాలను నేను సిద్ధాంతాల పరంగానే చూస్తా. వ్యక్తిగతంగా చూడను. ఇది కొరవడటం వల్లే వైసీపీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేకపోయాయి. నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద. మా గత రాజకీయ ప్రయాణం వల్ల నేను కలిసే నేతలైనా, విష్ చేసే నేతలైనా నేనేమిటో వారికి తెలుసు. నా మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు" అంటూ ట్వీట్ చేశారు.