Kabaddi: భారత్ చేతిలో మరోమారు చిత్తయిన పాక్.. కబడ్డీలో టీమిండియా గెలుపు
- కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో భారత్ శుభారంభం
- చిరకాల ప్రత్యర్థిపై 36-20తో ఘన విజయం
- ఆద్యంతం భారత్‌దే పైచేయి
మ్యాచ్ ఏదైనా ప్రత్యర్థి పాకిస్థాన్ అంటే రెచ్చిపోయే భారత ఆటగాళ్లు మరోమారు దాయాదిని చిత్తు చేశారు. దుబాయ్‌లో జరుగుతున్న కబడ్డీ మాస్టర్స్ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై చెలరేగి ఆడి 36-20తో ఘన విజయం సాధించింది.
అజయ్ ఠాకూర్ సారథ్యంలోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఆట ఆరంభం నుంచి ముగిసే వరకు భారత ఆటగాళ్లు ఎక్కడా పట్టు సడలకుండా చూసుకున్నారు. ప్రథమార్థంలో 22-9 పాయింట్లతో ఉన్న భారత్ ద్వితీయార్థంలోనూ అదే జోరును కొనసాగించి విజయాన్ని అందుకుంది. ఈ కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో పాక్, కెన్యాలతో కలిసి భారత్ గ్రూప్-ఎలో ఉండగా, గ్రూప్-బిలో ఇరాన్, కొరియా, అర్జెంటీనా ఉన్నాయి.