Jammu And Kashmir: ఇక నరమేధమే... కశ్మీర్ లో కలకలం రేపుతున్న లష్కరే తోయిబా ప్రెస్ రిలీజ్!
- కశ్మీర్ లో ప్రారంభమైన గవర్నర్ పాలన
- స్పందించిన లష్కరే తోయిబా
- ప్రజలను చంపేందుకు బీజేపీ సైన్యాన్ని వాడుకుంటోందని ఆరోపణ
జమ్మూ కశ్మీర్ లో పీడీపీ - బీజేపీ సంకీర్ణ పాలన ముగిసి గవర్నర్ పాలన ప్రారంభమైన తరువాత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తొలిసారి స్పందించింది. లష్కరే తోయిబా చీఫ్ మహ్మద్ షా పేరిట భారత మీడియాకు ఓ ప్రకటన అందింది. కశ్మీర్ లో తాము గవర్నర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్రంలో నరమేధం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ తో పాటు పలువురు నేతల అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని, పెద్దసంఖ్యలో కశ్మీరీలను ఊచకోత కోసేందుకే గవర్నర్ పాలన విధించారని ఆరోపించింది.
1990ల నాటి పరిస్థితులను మరోసారి గుర్తుకు తెస్తున్నారని, ఆపరేషన్ ఆలౌట్ పేరిట కశ్మీరీలను చంపేందుకు బీజేపీ సర్కారు సైనిక చర్యలకు దిగుతోందని, 8 లక్షల మంది సైనికులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇక్కడ ప్రజలు బానిసలుగా బతుకుతున్నారని, భారత సైన్యం ప్రధాన అజెండాను బయటపెట్టేందుకు ప్రయత్నించినందునే జర్నలిస్టు బుఖారీని హత్య చేయించారని కూడా ఆరోపించింది. కాస్త ఆలస్యమైనా కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి నిజాన్ని తెలుసుకుందని ఈ ప్రకటనలో లష్కరే తోయిబా వ్యాఖ్యానించింది.