irctc: వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఐఆర్సీటీసీ-ఐపే’
- రైల్వే టికెట్లు ఆన్ లైన్ లో కొనుగోలుకు కొత్త పేమెంట్ విధానం
- ఆగస్టు 18 నుంచి ‘ఐఆర్సీటీసీ-ఐపే’ ప్రారంభం
- ఈ విధానంలో అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు చెల్లుతాయి
రైల్వే టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వినియోగదారుల కోసం కొత్త పేమెంట్ విధానాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తేనుంది. ‘ఐఆర్సీటీసీ-ఐపే’ విధానాన్ని తీసుకు వస్తున్నట్టు ఓ ట్వీట్ లో పేర్కొంది. ‘ఐఆర్సీటీసీ. కో.ఇన్’ (irctc.co.in) వెబ్ సైట్ ద్వారా ‘ఐఆర్సీటీసీ-ఐపే’ విధానాన్ని ఆగస్టు 18వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది.
ఈ విధానంలో అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నేషనల్ కార్డులు కూడా చెల్లుబాటవుతాయని, ఆటో డెబిట్, యూపీఐ, వ్యాలెట్ ను ఉపయోగించి వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. ఒకవేళ వినియోగదారుడు తమ టికెట్ ను వాపస్ చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలకు, ఈ పద్ధతి ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని, రిఫండ్ కేసులను పరిష్కరించే అవకాశం ఉందని తెలిపింది. అన్ని బ్యాంకులను ఈ కొత్త విధానానికి అనుసంధానం చేశామని, ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ కూడా తమకు లభించిందని రైల్వే శాఖ పేర్కొంది.