Andhra Pradesh: ఏపీలో భూదార్ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: ఇన్ చార్జి సీఎస్
- ఆధార్ తరహాలో ప్రతి భూమికి, స్థిరాస్తికి భూదార్ ఇస్తాం
- ఇది అమల్లోకి వస్తే రైతుల సమయం, సొమ్ము ఆదా
- ఈ ప్రాజెక్టు అమలుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించాం
రాష్ట్రంలో భూ సేవ (భూదార్) ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్ చార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో భూదార్ ప్రాజెక్టు అమలుకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు.
ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ, ఒక క్లిక్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం అందించే లక్ష్యంతో భూదార్ ను అమలులోకి తేవడం జరుగుతుందని అన్నారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి, స్థిరాస్తికి భూదార్ ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వెబ్ ల్యాండ్ లో పట్టాదారుని పేరు మార్పు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.
భూదార్ అమలులోకి వస్తే రైతులకు సమయం, సొమ్ము ఆదా అవుతాయని, భూవివాదాలు అరికట్టడంతోపాటు ఒకేచోట అందుకు సంబంధించిన వివరాలను పొందేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన సర్వే ఇతర ప్రక్రియలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు.
అంతేగాక, భూదార్ లో భూభాగాన్ని జియో ట్యాగింగ్ చేసి 11 అంకెలతో కూడిన సంఖ్యను ప్రభుత్వం కేటాయించడం జరుగుతుందని, ఈ సంఖ్య 0తో ప్రారంభమవుతుందని, భూదార్ ద్వారా రాష్ట్రంలోని ఆరు శాఖలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి రానుందని అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు, మున్సిపల్, పంచాయితీ రాజ్, అటవీశాఖలకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించనున్నట్టు చెప్పారు.