yoga: యోగా చేయనివాళ్లు ముంబయి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది: బీహార్ ఉప ముఖ్యమంత్రి చురక
- యోగా డేలో పాల్గొనని బీహార్ సీఎం నితీశ్
- చాలా మంది జేడీయూ నేతలు పాల్గొన్నారన్న సుశీల్ మోదీ
- ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా
- ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న లాలూ
ప్రపంచ యోగా డే రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు యోగా చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, బీహార్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న జేడీయూ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం ఈరోజు యోగాకు దూరంగా ఉన్నారు. ఆయన యోగా డేలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఈ విషయంపై బీజేపీ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ... నితీశ్ కుమార్‌తో పాటు చాలామంది బీజేపీ మంత్రులు కూడా యోగా డేలో పాల్గొనలేదని, వారంతా యోగాకు వ్యతిరేకమని భావించరాదని అన్నారు. జేడీయూకి చెందిన చాలా మంది నేతలు యోగా డేలో పాల్గొన్నారని అన్నారు. ఆర్జేడీ, జేడీయూకి చెందినంత మాత్రాన వారు యోగా చేయకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.
అలాగే, ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి యోగా చేయాలని లేదుకదా? అని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. నితీశ్ కుమార్ ప్రతిరోజూ యోగా చేస్తారని తనకు తెలుసని, యోగా చేయనివాళ్లు మాత్రం ముంబయి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని చురకలంటించారు. కాగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.