Maharashtra: థర్డ్‌ఫ్రంట్‌కు శివసేన నో.. తదుపరి ముఖ్యమంత్రి శివసేన వ్యక్తేనన్న ఉద్ధవ్!

  • మోదీపై విరుచుకుపడిన ఉద్ధవ్ థాకరే
  • వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుపై స్పందించని శివసేన చీఫ్
  • కాల్పుల విరమణపై నిప్పులు

మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన వ్యక్తేనని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని, ముందుకే వెళ్తానని తేల్చిచెప్పారు. థర్డ్‌ఫ్రంట్‌లో శివసేన చేరబోదని కుండబద్దలుగొట్టిన ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు.

శివసేనతో సయోధ్య కోసం ప్రయత్నించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 6న ముంబైలో ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ 52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీజేపీపైనా, ప్రధాని నరేంద్రమోదీపైనా విరుచుకుపడ్డారు. అయితే, మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం గురించి కానీ, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న ఆయన కుమారుడు, సేన యూత్ వింగ్ చీఫ్ అదిత్య వ్యాఖ్యలపైన కానీ స్పందించలేదు.

జమ్ము కశ్మీర్‌లోని పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడాన్ని ఉద్ధవ్ స్వాగతించారు. అయితే, రంజాన్ రోజు భద్రతా కార్యకలాపాలను నిలిపివేయడంపై మండిపడ్డారు. ‘‘పీడీపీ నుంచి బయటకు రావడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, మూడేళ్ల తర్వాత, 600 మంది సైనికులు అసువులు బాసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని మండిపడ్డారు.

ఉగ్రవాదులకు మతం లేనప్పుడు రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ ఎలా పాటించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీపావళి, విజయదశమి, గణేశ్ చవితి సమయాల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ పాటించదని గుర్తు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడే థర్డ్‌ఫ్రంట్‌లో తాము కలిసేది లేదని ఉద్ధవ్ పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News