Ganta Srinivasa Rao: బుజ్జగింపులతో అలక వీడిన గంటా.. నేటి సీఎం కార్యక్రమానికి హాజరు!

  • సర్వేపై మనస్తాపం
  • రెండు రోజులుగా నియోజకవర్గ నాయకులతో భేటీ
  • సర్వేలను పట్టించుకోవద్దంటూ నేతల ఫోన్లు
  • ఎట్టకేలకు అలకవీడిన మంత్రి

సర్వేల పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం జరుగుతోందంటూ అలకబూనిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును అధిష్ఠానం బుజ్జగించింది. తన నియోజకవర్గమైన భీమిలిలో గంటా పనితీరుపై అసంతృప్తి ఉందంటూ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో నొచ్చుకున్న మంత్రి కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు. గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని నాయకులతో సమావేశమై తనపై గల వ్యతిరేకతకు కారణాన్ని ఆరా తీస్తున్నారు.

అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం కలకలం రేపింది. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే ఉద్దేశంతోనే సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. మరోవైపు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనుండడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలిలో నిర్మించిన సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తిని సీఎం ప్రారంభించనున్నారు. అయితే, రెండు రోజులుగా పార్టీ నేతలతో టచ్‌లో లేకుండా పోయిన గంటా నేటి సీఎం కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

మరోవైపు, సర్వేపై మంత్రి బాధపడుతున్నారని తెలియడంతో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించినట్టు తెలిసింది. సర్వేలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోలేదని, సీఎం పర్యటనలో పాల్గొనాలని కోరారు. దీంతో మెత్తబడిన గంటా నేటి సీఎం పర్యటనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Ganta Srinivasa Rao
Andhra Pradesh
Visakhapatnam District
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News