Gujarath: 'సింహాలను చంపడమే కాదు.. ఫొటోలు తీయడం కూడా నేరమే' అంటున్న గుజరాత్ ప్రభుత్వం
- సింహాల సంరక్షణకు కొత్త నిర్ణయం తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం
- నిబంధనలను అతిక్రమిస్తే ఏడేళ్ల శిక్ష
- వేటాడటం అంటే చంపడం ఒక్కటే కాదన్న అటవీశాఖ మంత్రి
సింహాలను సంరక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. సింహాలను ఫొటోలు తీసినా నేరమే అని, కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించిన వారికి అటవీ సంరక్షణ చట్టం 1978 కింద ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని తెలిపింది. వేటాడటం అంటే చంపడం మాత్రమే కాదని, హింసించినా అది వేటే అవుతుందని గుజరాత్ అటవీశాఖ మంత్రి గణ్ పత్ వాసవ తెలిపారు.
రాష్ట్రంలో సింహాల ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించినా, వాహనాలపై వాటిని వెంబడించినా, ఫొటోలు తీసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుజరాత్ లో సింహాలను వెంటాడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు అవి కనిపిస్తే మాంసాహారం విసిరి, వాటిని వేటాడడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.