paruchuri gopalakrishna: నాలోని రచయితను గుర్తించింది .. ధైర్యం చెప్పింది ఆయనే: పరుచూరి గోపాలకృష్ణ
- ఆయన చాలా గొప్ప దర్శకుడు
- ఒకే ఏడాది నాలుగు భారీ హిట్లు ఇచ్చారు
- నాతో మాటలే కాదు పాటలు కూడా రాయించారు
తెలుగు సినిమా ప్రపంచంలో కథా రచయితగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నవారిలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "పీసీ రెడ్డి గారు అప్పట్లో గొప్ప దర్శకులు. ఒక రాఘవేంద్రరావు .. దాసరి నారాయణరావు మాదిరిగా ఆయన వరుస హిట్లు ఇచ్చారు.
ఒకే సంవత్సరం (1972)లో 'బడిపంతులు' .. 'ఇల్లు ఇల్లాలు' .. 'మానవుడు దానవుడు' .. 'పాడిపంటలు' ఒకదాని తరువాత ఒకటిగా ఆయన నుంచి వచ్చాయి. ప్రతి సినిమా పాతిక వారాలు ఆడేసింది .. అంతటి మహానుభావుడు ఆయన. అంతటి గొప్ప దర్శకుడు నాలోని రచయితను గుర్తించారు. నువు చాలా పెద్ద రచయితవి అవుతావంటూ నాకు ధైర్యం చెప్పారు. 'మానవుడు మహనీయుడు' సినిమాలో మాటలు మాత్రమే కాకుండా మూడు పాటలు నాతో రాయించారాయన. ''నువ్వు తప్పకుండా పైకి వస్తావు .. ఇండస్ట్రీకి వచ్చేసేయి అని భరోసా ఇచ్చిన మంచి మనిషి ఆయన" అంటూ గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.