Jammu And Kashmir: కశ్మీర్లో పీడీపీతో తెగదెంపులేనా?: ఎమ్మెల్యేలను ఉన్నపళంగా ఢిల్లీకి పిలిచిన అమిత్ షా!
- చిక్కుల్లో జమ్మూ కశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం
- నేడు ఎమ్మెల్యేలు, నేతలతో అమిత్ షా కీలక సమావేశం
- రంజాన్ తరువాత మారిన పరిస్థితులే కారణం
జమ్మూ కశ్మీర్ ను పాలిస్తున్న బీజేపీ - పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం చిక్కుల్లో పడిందా? ఇరు పార్టీలూ తెగదెంపులు చేసుకోనున్నాయా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఏమైనా జరగవచ్చని అనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్ లోని బీజేపీ ఎమ్మెల్యేలంతా ఉన్నపళంగా ఢిల్లీకి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆదేశించగా, వారంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం కానున్న అమిత్ షా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, భద్రతాంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో పీడీపీతో విడిపోతే వచ్చే పరిస్థితులపైనా ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని సమాచారం. సంకీర్ణ ప్రభుత్వం సాగుతున్న తీరుపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించిన భారత సైన్యం, ఉగ్రవాదుల వేట పేరిట తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. ఇప్పటికే చాలా అంశాల్లో పీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు ఉండగా, కాల్పుల విరమణపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. 'ది రైజింగ్ కశ్మీర్' సంపాదకుడు సుజాత్ భుకారీ హత్య, ఆపై ఆర్మీ రైఫిల్ మ్యాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా హత్య చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.