railway: ఆదివారాల్లో రైళ్లు మరింత ఆలస్యం... అవసరమైతే ఉచిత భోజనం అందిస్తామని ప్రకటన
- ఆదివారాల్లో ఆరు గంటల మేర ట్రాక్ నిర్వహణ పనులు
- మిగిలిన రోజుల్లో రోజుకు రెండు గంటల చొప్పున
- ఐదారు గంటలు ఆలస్యమైతే రిజర్వ్ డ్ ప్రయాణికులకు ఉచిత భోజనం
ఇకపై ఆదివారాల్లో రైల్వే మరమ్మతుల పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా రైళ్లు ఐదారు గంటల మేర ఆలస్యం అయితే రిజర్వ్ డ్ టికెట్లను కలిగి ఉన్న ప్రయాణికులకు ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని ఆ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ రిజర్వ్ డ్ కేటగిరీలో ప్రయాణించే వారికీ ఉచిత భోజనం అందించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.
ఆగస్ట్ 15 నాటికి కొత్త టైంటేబుల్ ను ప్రకటిస్తామని, అందులో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆలస్యంగా నడిచే రైళ్ల సమాచారం ఉంటుందని మంత్రి తెలిపారు. ఓ ప్రణాళిక మేరకు నిర్వహణ, మరమ్మతుల పనులు చేపట్టాలని గత వారం రోజులుగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పనులను ఆదివారాల్లో ఆరు గంటల వరకు, మిగిలిన రోజుల్లో రోజుకు 2 గంటల మేర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.