Chandrababu: రూ. 25కు ఓకే... సమ్మె విరమించిన ఏపీ దేవాలయాల క్షురకులు!
- నాలుగు రోజులు కొనసాగిన నాయీ బ్రాహ్మణుల సమ్మె
- విరమిస్తున్నట్టు ప్రకటించిన జేఏసీ నేతలు
- సీఎం ముందు గలాటా చేసింది ఎవరో తెలియదన్న నేతలు
గడచిన నాలుగు రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమించేందుకు నిర్ణయించుకున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం జేఏసీ ప్రకటించింది. కేశ ఖండన టికెట్ పై ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 ను రూ. 25కు పెంచుతున్నట్టు సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు తాము అంగీకరిస్తున్నట్టు తెలిపారు.
నిన్న రాత్రి ఉండవల్లి లోని ప్రజాదర్బారులో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సీఎంతో సమావేశమై చర్చించారు. అమరావతిలో చంద్రబాబును నిలువరించి గలాటా చేసింది ఎవరో తమకు తెలియదని జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాస్ తెలిపారు. కార్మిక నేతలతో కలసి 15 మందిని సచివాలయానికి ఆహ్వానించామని, చర్చల తరువాత కింద గలాటా చేసిన వాళ్లను తాము ఎన్నడూ చూడలేదని అన్నారు.
కాగా, నిన్న సాయంత్రం తన విధులు ముగించుకుని చంద్రబాబు వెళుతున్న వేళ, కొందరు క్షురకులు 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేయగా, చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలో అదేపనిగా వార్తలు రావడంతో, సీఎంను కలిసి క్షమాపణలు చెప్పామని, మిగిలిన సమస్యలను కూడా సానుకూలంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని జేఏసీ గౌరవాధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య తెలిపారు.