Ola: ముస్లిం కాలనీకి వెళ్లేందుకు ఓలా డ్రైవర్ నిరాకరణ.. ప్రయాణికుడిని మధ్యలోనే దించేసిన వైనం!

  • ముస్లిం కాలనీకి వెళ్లబోనన్న డ్రైవర్
  • ఓలా తీరుపై ఆగ్రహావేశాలు
  • విషయం తెలిసి షాకయ్యామన్న ఓలా

తన కారెక్కిన ప్రయాణికుడిని గమ్యస్థానం చేర్చాల్సిన ఓలా డ్రైవర్ అతడిని మార్గమధ్యంలోనే దించేశాడు.. కారణం అతడు వెళ్లాల్సింది ముస్లిం కాలనీ కావడమే. ఢిల్లీలో జరిగిందీ ఘటన. దీంతో ఓలా తీరుపై మరోమారు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్‌లో ఓలాను తిట్టిపోస్తున్నారు. విషయం తెలిసి తాము కూడా దిగ్భ్రాంతికి లోనయ్యామని, తమకు దేశమంతా ఒక్కటేనని ఓలా పేర్కొంది.

ఢిల్లీకి చెందిన జర్నలిస్టు అసద్ అష్రఫ్ జామియా నగర్ వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే, అది ముస్లిం కాలనీ అని గుర్తించిన డ్రైవర్ కారును ఆపేసి అసద్‌ను దిగాలని కోరాడు. జామియా నగర్ ముస్లిం కాలనీ అని, అక్కడికి తాను వెళ్లనంటే వెళ్లనని తెగేసి చెప్పాడు. అష్రఫ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అష్రఫ్ తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారొచ్చి అతడిని తీసుకెళ్లారు.  

తనకు జరిగిన అవమానాన్ని అష్రఫ్ ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. తాను బీకే దత్ కాలనీలో కారు ఎక్కానని, డ్రైవర్‌కు ఓటీపీ ఇవ్వగానే, తాను జామియా నగర్‌కు క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్టు గుర్తించాడని పేర్కొన్నాడు. అక్కడి నుంచి తనను పెద్దగా జన సంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి క్యాబ్ దిగాలని సూచించాడని చెప్పాడు. ఎందుకని ప్రశ్నించగా, అది ముస్లిం కాలనీ అని, తాను అక్కడికి రాలేనని తేల్చి చెప్పడంతో నిర్ఘాంతపోయినట్టు పేర్కొన్నాడు.

ఈ ఘటనపై స్పందించిన ఓలా.. ఆ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామని, ఓలా అంటే ఇండియా అనే తాము భావిస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News