Vijayawada: మలుపు తిరుగుతున్న మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్య కేసు.. పోలీసుల తీరుపై అనుమానాలు
- రెండు రోజుల క్రితం తేజస్విని ఆత్మహత్య
- తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
- రెండు రోజుల తర్వాత సెక్షన్ల మార్పు
ఆత్మహత్య చేసుకున్న మాజీ యాంకర్ తేజస్విని కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో నివసిస్తున్న మట్టపల్లి తేజస్విని (25) శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, రెండు రోజుల తర్వాత తేజస్విని ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో సూసైడ్ నోట్ దొరికిందంటూ కేసును సెక్షన్ 498, 306కు మార్చడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వరకట్న వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో ఉండడంతో సెక్షన్ 498ను, ఆత్మహత్యకు పాల్పడినందుకు సెక్షన్ 306ను నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే, సూసైడ్ నోట్ ముందే లభ్యమైనా తొలుత ఈ సెక్షన్లు ఎందుకు నమోదు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
తేజస్విని మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం దానిని తీసుకెళ్లేందుకు ఆమె తల్లి వెంకటరమణమ్మ నిరాకరించారు. భార్య మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఇష్టపడని భర్త పవన్ కుమార్ విజయవాడలోనే దహన సంస్కారాలు నిర్వహించారు.