Narendra Modi: మోదీని చంద్రబాబు నిలదీస్తారు, కడిగేస్తారు అన్నారు.. చివరికి వంగి వంగి దండాలు పెట్టొచ్చారు!: జగన్
- ఉత్తరకుమారుడిలా గొప్పలు చెప్పుకున్నారు
- యుద్ధం చేస్తాం అంటూ ఢిల్లీకి వెళ్లారు
- ఎంత గొప్పగా ఢిల్లీలో యుద్ధం చేశారో చూశాం
- ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రవర్తించిన తీరుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరంలో ఆయన ర్యాలీలో మాట్లాడుతూ... "చంద్రబాబు నాయుడికి సంబంధించిన మీడియా మొన్న ఏం చూపించింది. ఆయన ఢిల్లీకి వెళుతున్నారని, ఎన్డీఏ నుంచి విడిపోయాక మోదీని చంద్రబాబు మొదటిసారి కలుస్తున్నారని ఊదరగొట్టుకున్నారు.
నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా మోదీని నిలదీస్తారు, కడిగేస్తారు, యుద్ధం ప్రకటిస్తారు అని మనం టీవీల్లో చెబుతుండగా చూశామా? లేదా? ఉత్తరకుమారుడి కథ మీ అందరికీ తెలుసా? మహా భారతంలో ఉత్తరకుమారుడు ఉంటాడు. కౌరవుల మీద యుద్ధం చేయడానికి పోతున్నానని చెబుతాడు. యుద్ధం బీభత్సంగా చేస్తానని చెప్పుకుంటాడు.. అందరి తలపాగాలను తీసుకొస్తానని అంటాడు..
ఆ తరువాత ఉత్తరకుమారుడి పరిస్థితి ఏమిటీ? కౌరవ సైన్యాన్ని చూసి వణికిపోయి రథాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. అచ్చం చంద్రబాబు కూడా అలాగే చేశారు. ఇక్కడ ఎన్నో చెప్పుకున్నారు. ఢిల్లీకి వెళ్లి వంగి వంగి మోదీ ఎడమచేతిని పట్టుకోవడానికి పాకులాడారు. ఎంత గొప్పగా మన ఉత్తరకుమారుడు ఢిల్లీలో యుద్ధం చేశారో చూశాం. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు. కానీ, పైకేమో బీజేపీని తిడతారు.. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను తన పక్కనే పెట్టుకుంటారు.. మరోవైపు బీజేపీ నేత భార్యకు టీటీడీలో పదవి అప్పజెప్పుతారు" అని విమర్శించారు.