chicago: అమెరికాలో తారల సెక్స్ స్కాండల్.. టాలీవుడ్ ను నిలదీసిన మహిళా నాయకురాలు దేవి
- అమెరికాకు బెదిరించి తీసుకెళ్లారు
- షికాగో పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఉంది
- షికాగో సెక్స్ రాకెట్ పై ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేదు?
- ఇంత వరకు క్యాష్ కమిటీని కూడా వేయలేదు
అమెరికాలో బయటపడిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ పై మహిళా నాయకురాలు దేవి మండిపడ్డారు. సినీ రంగంలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్, షికాగో సెక్స్ రాకెట్ లను తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ను నియంత్రించేందుకు క్యాష్ కమిటీ వేస్తామని చెప్పిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇంతవరకు ఆ పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు, సినీ పెద్దలతో కూడా చర్చించామని... కానీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ లేదని అన్నారు.
కోఆర్డినేటర్ వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పారు. నటీనటులకు, జూనియర్ ఆర్టిస్టులకు బ్రోకర్ వ్యవస్థ ఉండకూడదని అన్నారు. ఎవరిపైనైనా మూడుసార్ల కంటే ఎక్కువ ఆరోపణలు వచ్చినా, కేసులు నమోదైనా... అలాంటి వారిని ఏడాది పాటు ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేయాలనిడిమాండ్ చేశారు.
షికాగోలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వార్తలు కలకలం రేపుతున్నప్పటికీ... సినీ పరిశ్రమ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని దేవి అన్నారు. ఇష్టపూర్వకంగానే షికాగో వెళ్లారని కొందరు చెబుతుండటం సరికాదని... బెదిరించి వారిని తీసుకెళ్లినట్టు షికాగో పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని చెప్పారు. చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీ నుంచి వెలివేస్తామని బాధితురాళ్లు విచారణలో చెప్పారని తెలిపారు. సినీ రంగాన్ని సంస్కరించుకోవాలని సూచించారు.