Karnataka: పార్టీ నేతలకు ఆమె 'సేవ' నచ్చిందంటే అభ్యంతరం ఏంటి?: కర్ణాటక మంత్రి జయమాలపై మహిళా నేత లక్ష్మి!
- జయమాల సేవలు నచ్చే మంత్రి పదవి ఇచ్చారన్న కేపీసీసీ మహిళా అధ్యక్షురాలు
- 'సేవ' పదంపై మీడియాలో రాద్ధాంతం
- ఉత్తర కర్ణాటక భాషలో ఆ పదం కామనన్న లక్ష్మీ హెబ్బాళ్కర్
- జయమాలను కలిసి వివరణ ఇస్తానని వెల్లడి
ఆమె చేస్తున్న సేవలు పార్టీ నాయకులకు ఇష్టమై ఉండొచ్చని, అందుకే మంత్రి పదవి వచ్చిందని, మంత్రి జయమాలపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ, కర్ణాటక పీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాళ్కర్ వివరణ ఇచ్చారు. పార్టీ కోసం జయమాల ఎంతో శ్రమించారని, ఆ ఉద్దేశంతోనే ఉత్తర కర్ణాటక భాషలో 'సేవ' అన్న పదాన్ని వాడానే తప్ప మరో ఉద్దేశం తనకు లేదని ఆమె వ్యాఖ్యానించారు.
తన నోటి నుంచి వచ్చిన 'సేవ' అన్న పదాన్ని అపార్థం చేసుకునేలా ప్రచారం చేశారని ఆరోపించిన ఆమె, తన మాటలకు జయమాల నొచ్చుకున్నారని తెలుసుకుని తాను బాధపడినట్టు తెలిపారు. తనకన్నా ఆమే పార్టీకి ఎక్కువగా సేవ చేసిందని, అందుకే ఆమెకు మంత్రి పదవి లభించిందన్న భావన తనలో ఉందని చెప్పారు. ఆమెకు పదవి దక్కడం పట్ల తనకు అభ్యంతరాలు లేవని, తాను జయమాలను కలిసి వివరణ ఇచ్చి, ఊరడిస్తానని చెప్పారు.