manisharma: చిరూ వద్దన్నా ఒప్పించాను .. చరణ్ విషయంలోను అలాగే జరిగింది: సంగీత దర్శకుడు మణిశర్మ
- చిరూ కోసం ఆ సాంగ్ పాడించాను
- ఆ వాయిస్ చిరూకి నచ్చలేదు
- చరణ్ పాట విషయంలోను ఇదే అనుభవం
ఏ హీరోకి ఏ తరహా బాణీలు కడితే బాగుంటుంది .. ఏ పాటను ఏ సింగర్ చేత పాడిస్తే బాగుంటుంది అనే విషయాలు మణిశర్మకి బాగా తెలుసు. అలాంటి మణిశర్మ 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. " చిరంజీవి హీరోగా చేసిన 'చూడాలని వుంది' సినిమాకి పనిచేశాను. ఈ సినిమా కోసం 'రామ్మా .. చిలకమ్మా' అనే పాటను ఉదిత్ నారాయణ్ తో పాడించాను.
చిరంజీవి ఈ పాట వినేసి .. 'రొంప పట్టిన వాయిస్ లా వుంది .. వద్దు' అన్నారు. కానీ యూనిట్ సభ్యులంతా ఈ సాంగ్ వైపే మొగ్గుచూపడంతో ఆ పాటను ఉంచేశారు. ఆ తరువాత చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ . . 'అప్పుడప్పుడూ జడ్జ్ మెంట్ విషయంలో పొరపాటు జరుగుతూ ఉంటుంది' అని అన్నారు. ఇక 'చిరుత' సినిమాలో 'ఓసోసి .. రాకాసి' పాట విషయంలోను ఇలాగే జరిగింది. ఈ పాట టీమ్ లో ఎవరికీ నచ్చలేదు .. డైరెక్టర్ ఆ పాటను తీసేద్దామన్నారు. చిరంజీవి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ పాటలో కొత్తదనం ఉందనీ .. ఆ పాట పట్ల చాలా కాన్ఫిడెంట్ గా వున్నానని ఒప్పించాను. సినిమా రిలీజ్ తరువాత ఆ పాటే అన్నిటి కన్నా పెద్ద హిట్ అయింది" అని అన్నారు.