Hyderabad: హైదరాబాద్ లో మందేసి చిక్కితే అంతే... ఐదు నెలల్లో 2 వేల మంది జైలుకు!
- జనవరి నుంచి మే మధ్య 12 వేలకు పైగా కేసులు
- 2,054 మందికి జైలు శిక్షలు
- 778 లైసెన్స్ లను రద్దు చేసిన న్యాయస్థానాలు
- అయినా మారని మందుబాబులు
గడచిన ఐదు నెలల వ్యవధిలో హైదరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మొత్తం 12,006 కేసులను నమోదు చేసి, మందుబాబులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా, వారిలో 2,054 మంది జైలు శిక్షలు అనుభవించారు. ఇక 778 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు సస్పెండ్ అయ్యాయని, వీరి నుంచి రూ. 2.51 కోట్లకు పైగా జరిమానా వసూలైందని పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జనవరిలో 3,007, ఫిబ్రవరిలో 2,313, మార్చిలో 1,602, ఏప్రిల్ లో 2,502, మేలో 2,582 కేసులు నమోదైనట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. మందుబాబులకు జైలు శిక్షలు పడుతున్నా, వారు మారడం లేదని, తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని తాము ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఫలితం రావడం లేదని, హైదరాబాద్ లోని మలక్ పేట ప్రాంతం అత్యధిక డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైన ప్రాంతంగా నిలిచిందని తెలిపారు. మలక్ పేట తరువాత గోపాలపురం, ఆపై ఎస్ ఆర్ నగర్, కాచిగూడ, టోలీచౌకి ప్రాంతాలు మందుబాబుల విషయంలో ముందున్నాయని తెలిపారు.