Daati Maharaj: దాతీ మహారాజ్ ఆశ్రమం నుంచి 600 మంది యువతుల అదృశ్యం... రంగంలోకి దిగిన పోలీసులు
- రాజస్థాన్ లోని అల్వాస్ లో దాతీ మహారాజ్ ఆశ్రమం
- ఆయన అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు
- ఆశ్రమంలో కనిపించని వందలాది మంది అమ్మాయిలు
- పరారీలో దాతీ మహారాజ్
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ ఆశ్రమం నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యం అయినట్టు భావిస్తున్న పోలీసులు, వారు ఎక్కడికి పోయారన్న విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగారు. రాజస్థాన్ లోని అల్వాస్ లో దాతీ మహారాజ్ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ, తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునేవాడు.
ఇక తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి ఆలనా పాలనా తానే చూసుకుంటున్నానని గతంలో ఎన్నోమార్లు దాతి మహారాజ్ చెప్పుకునేవాడు. ఆయన తనను అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించారని తెలుస్తోంది. మిగిలిన అమ్మాయిలంతా ఎక్కడికి వెళ్లారన్న విషయమై విచారణ జరుపుతున్నామని, ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్ ను వెతుకుతున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
దాతీ మహారాజ్ తనను దశాబ్దం పాటు ఆశ్రమంలో బందీగా ఉంచాడని, ఆయనతో పాటు ఆయన ఇద్దరు అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఆయన వద్ద ఉండే మహిళా సహాయకురాలు, అమ్మాయిలను బలవంతంగా ఆయన గదిలోకి పంపుతుందని తెలిపింది. కాగా, ఆరోపణలు చేస్తున్న యువతి తనకు కుమార్తె వంటిదని వ్యాఖ్యానించిన దాతి మహరాజ్, తనను అరెస్ట్ చేయవచ్చని తెలుసుకుని ఆశ్రమం వదిలి పారిపోవడం గమనార్హం.