Chandrababu: మోదీపై చంద్రబాబు ఫైట్ చేస్తున్నారు.. మరి, కేసీఆర్ ఎందుకు కొట్లాడరు?: వీహెచ్
- విభజన హామీల అమలుకు సీఎం చంద్రబాబు పోరాడుతున్నారు
- మోదీకి దీటుగా బాబు ఫైట్ చేస్తున్నారు
- మా సీఎం మాత్రం తన గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు
విభజన హామీల అమలు కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోరాడుతున్నారని, తమ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన భజన తాను చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్ట్ కు రావాల్సిన కేంద్రం నిధులు మొదలైన అంశాల గురించి చంద్రబాబు పోరాడుతున్నారని ప్రశంసించారు.
అదే, తమ ముఖ్యమంత్రి విషయానికొస్తే, ఎంత సేపటికీ, తను, తన భజన తప్ప చేస్తున్నదేమీ లేదు. బడుగు బలహీన వర్గాల కోసం తానొక్కడినే పోరాడుతున్నట్టు పెద్ద నాటకం ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు. ‘రైతుబంధు’ పథకం గురించి వివరించేందుకు ఢిల్లీకి మాత్రం ఆయన వెళతారని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అంశాలు మాత్రం ఆయనకు జ్ఞాపకం రావని విమర్శించారు.
కేవలం కేసీఆర్ తన గొప్పతనం గురించి, తన కొడుకు, మనవడి గొప్పతనం గురించి చెప్పుకోవడం తప్పితే రాష్ట్రానికి చేస్తోందేమీ లేదని విమర్శించారు. ఏపీకి అమలు కావాల్సిన హామీలపై మోదీకి దీటుగా చంద్రబాబు ఫైట్ కు దిగారు. మరి, నువ్వు (కేసీఆర్) ఎందుకు కొట్లాడవు?’ అని వీహెచ్ ప్రశ్నించారు.