Puri Jagannadh: దొరికిన పూరీ ఖజానా తాళాలు... జగన్నాథుని మహిమేనన్న కలెక్టర్!
- గోధుమ రంగు కవర్ లో మారు తాళాలు
- వెతుకుతుంటే కనిపించాయన్న కలెక్టర్ అరవింద్
- అసలు తాళాల సంగతేంటని ప్రశ్నించిన బీజేపీ
పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న వెల కట్టలేని ఖజానా గదులకు సంబంధించిన తాళాలు పోయాయని అందరూ భావిస్తున్న వేళ, తాళాలు దొరికాయని పూరీ కలెక్టర్ అరవింద్ అగర్వాల్ ప్రకటించారు. తాళాలు తిరిగి లభించడం నిజంగా దేవుడి అద్భుతమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఏప్రిల్ 4వ తేదీన దేవాలయం ఖజానాలోపలి చాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, గురువారం నాడు గోధుమ రంగులో ఉన్న ఓ సీల్డ్ కవర్ లో డూప్లికేట్ కీస్ బయట పడ్డాయి.
తాళాల కోసం వెతుకుతూ ఉంటే 'రత్న భండార్'కు సంబంధించిన మారు తాళాలు లభించాయని అగర్వాల్ మీడియాకు వివరించారు. ఐదు రోజుల పాటు రికార్డు గదులను వెతుకుతూ ఉంటే ఈ కవర్ కనిపించిందని ఆయన తెలిపారు. "ఇదో మిరాకిల్. మేమంతా తాళాల వెతుకులాటలో నిమగ్నమై ఉన్నాం. ఎంత వెతికినా తాళాలు లభించలేదు. నేనింక దేవుడిపైనే భారం వేసి మొక్కుకున్నాను. తాళాలు తిరిగి దొరికాయి" అని 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ తెలిపారు.
కాగా, మారు తాళాలు దొరికాయని కలెక్టర్ చేసిన ప్రకటనపై బీజేపీ స్పందిస్తూ, అసలు తాళం చెవులు ఎక్కడికి పోయాయో తేల్చాల్సిందేనని వ్యాఖ్యానించింది. దేవుడి ఆస్తులను కొల్లగొట్టేందుకు బీజేడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఒడిశా బీజేపీ అధికార ప్రతినిధి పీతాంబర్ ఆచార్య ఆరోపించారు.