Solar Energy: భారత సోలార్ ప్లాంటులో సాఫ్ట్ బ్యాంక్ రూ. 4 లక్షల కోట్లు పెట్టుబడి... అతి త్వరలో కేంద్రం ప్రకటన!
- భారత సౌర విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడి
- 60 నుంచి 100 బిలియన్ డాలర్లు పెట్టనున్న సాఫ్ట్ బ్యాంక్
- కలిసిరానున్న సౌదీ అరేబియా
జపాన్ కేంద్రంగా నడుస్తున్న సాఫ్ట్ బ్యాంక్, భారత సౌర విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సాఫ్ట్ బ్యాంక్ తుది దశ చర్చలు సాగిస్తోందని, ఈ పెట్టుబడిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని జపాన్ ప్రభుత్వ న్యూస్ ఏజన్సీ 'ఎన్ హెచ్ కే' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సౌదీ అరేబియా కూడా ఇందులో భాగస్వామ్యం కానుందని, 60 నుంచి 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 6.6లక్షల కోట్ల మధ్య) ఇండియాలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధికి వెచ్చించనున్నట్టు తెలిపింది. కాగా, ఈ విషయంలో సాఫ్ట్ బ్యాంక్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఏ అధికారీ అందుబాటులో లేరు. ఇటీవలే ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ప్లాంటును సౌదీ అరేబియాలో నెలకొల్పేలా తాము నిర్వహిస్తున్న విజన్ ఫండ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు సాఫ్ట్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.