Andhra Pradesh: గుంటూరులో పట్టపగలే దారుణం.. అత్తాకోడళ్లను కట్టేసి రూ.78 లక్షల నగదు, బంగారం చోరీ!
- సినీ ఫక్కీలో ఉదయం 11 గంటలకే దోపిడీ
- రూ.68 లక్షలున్న మరో బ్యాగును చూడని వైనం
- దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో జరిగిన దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లోని మహిళలను కట్టేసి లక్షల రూపాయల నగదు, బంగారం దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన మేకా వేమారెడ్డి ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. వేమారెడ్డి, ఆయన కుమారుడు బ్రహ్మారెడ్డి ఇంట్లో లేని సమయంలో లోపలికి ప్రవేశించిన ముగ్గురు దుండగులు వేమారెడ్డి భార్య కమల, కోడలు పార్వతిని తాళ్లతో కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు.
వారి నుంచి బీరువా తాళాలను బలవంతంగా తీసుకుని బీరువా తెరిచి అందులోని రూ.78 లక్షల నగదు, 40 సవర్ల బంగారాన్ని దోచుకుని వెళ్లిపోయారు. అయితే, మరో బ్యాగులో ఉన్న రూ.68 లక్షలను దుండగులు గుర్తించకపోవడం గమనార్హం. ఏడు నెలల క్రితం కమల తల్లి రాములమ్మకు చెందిన ఎకరం పైచిలుకు భూమిని రూ.3 కోట్లకు విక్రయించారు. ఈ డబ్బుతో కృష్ణా జిల్లాలోని దేవరపల్లి వద్ద 3.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకోసం డబ్బును ఇంట్లో పెట్టుకున్నారు. అందులో భాగంగానే గురువారం వేమారెడ్డి, బ్రహ్మారెడ్డి దేవరపల్లి వెళ్లారు. వారు అలా బయటకు వెళ్లారో, లేదో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దోచుకున్నారు.
సినీ ఫక్కీలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వివరించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో దుండగుల్లో ఒకరు అడ్రస్ అడుగుతున్నట్టు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న కమలపై దాడి చేసి తాళ్లతో కట్టేశాడు. తర్వాత రెండో వ్యక్తి ఇంట్లోకి వచ్చి పక్క గదిలో ఉన్న కోడలు పార్వతిపై దాడి చేశాడు. ఆ తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు. అనంతరం ఇద్దరినీ తాళ్లతో కట్టేశారు.
దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన కమల చనిపోయినట్టు నటించడంతో దుండగులు ఆమె వద్ద బీరువా తాళాలను తీసుకుని దోచుకున్నారు. పార్వతి వద్ద ఉన్న బంగారు నగలను కూడా లాక్కుని వెళ్లిపోయారు. వారు బైక్‌పై రావడం, వెళ్లడం అందరూ చూసినప్పటికీ ఎవరో తెలిసిన వ్యక్తులనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభ్యమైనట్టు అర్బన్ ఎస్పీ విజయారావు తెలిపారు.