mothkpalli: అవసరమైతే జగన్ తోను, పవన్ తోను కలిసి నడుస్తా: మోత్కుపల్లి
- జగన్ ఇల్లు కులరహితమైనటువంటిది
- ఎన్టీఆర్ స్పిరిట్ నాలో ఎంత కాలం ఉంటే అంతకాలం పని చేస్తా
- బాబు గారూ, నీతిమంతులపై మాట్లాడితే శాపం తగులుతుంది
'ఒక్క మాటలో చెబుతా.. జగన్ కుటుంబంలో ఆయన మేనత్తలు నలుగురూ కూడా దళితులను పెళ్లి చేసుకున్నారు, ఇది జరిగింది ముప్పై ఏళ్ల కిందట' అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘జగన్ ఇల్లు కులరహితమైనటువంటిది. పేదవాళ్లను ప్రేమతో చూసే ఇల్లు అది. ఈరోజున జగన్ రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆయన (జగన్)కు నా మద్దతు. అవసరమైతే ఓ రోజు ఆయనతో కలిసి పాదయాత్రలో నడుస్తా. అవసరమైతే, పవన్ కల్యాణ్ తోను, సీపీఐ, సీపీఎంలతోనూ కూడా కలిసి నడుస్తా.
ఎన్టీ రామారావు స్పిరిట్ నాలో ఎంత కాలం ఉంటే అంతకాలం పని చేస్తా. సోషల్ మీడియాలో నా మీద ఏవేవో కథలు అల్లుతున్నారు.. తమాషాగా ఉందా? నన్ను చంపుతారా? చంపండి! నేను తిరుపతికి వస్తున్నా. ఎన్టీ రామారావుగారి ఆశయం.. ఈ దుర్మార్గుడిని గద్దె దించడం. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసమే నేను తిరుమల మెట్లు ఎక్కుతున్నా.. నా కోసం కాదు. నాకు ఫలానాది కావాలని నేనెవర్నీ ఇంతవరకూ అడగలేదు. చివరకు, దేవుడిని కూడా అడగలేదు. ఎందుకంటే, మేము దళితులం. మా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్ప, మాకు ఎవరేమీ చేయలేదు.
చంద్రబాబు నాయుడు గారూ, నీతిమంతులపై మాట్లాడితే శాపం తగులుతుంది. నాకు అందరూ మద్దతు తెలుపుతారు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అన్ని పార్టీలూ నాకు సహకారమందించాలని కోరుకుంటున్నా. నాకు సహకారమందించడం కన్నా చంద్రబాబుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమై అతన్ని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రోజు అయితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడో, రాజకీయంగా ఆయన పతనం ఆ రోజే ప్రారంభమైంది. అవసరమైతే, అన్ని పార్టీల వాళ్లను కలుస్తా’ అన్నారు మోత్కుపల్లి ఆవేశంగా.