Beauty Parlors: హైదరాబాద్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన 'బ్యూటీ కిలేడీ' చిక్కింది!
- నాలుగు నెలల్లో 25 దొంగతనాలు
- బ్యూటీ పార్లర్లే లక్ష్యంగా రెచ్చిపోయే డేసీ
- అరెస్ట్ చేసిన మారేడుపల్లి పోలీసులు
బ్యూటీ పార్లర్లలోకి కస్టమర్ మాదిరిగా ప్రవేశించి, బంగారు నగలను చాకచక్యంగా తస్కరించి మాయమవుతూ, జంట నగరాల పరిధిలోని మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న కిలేడీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గడచిన నాలుగు నెలల వ్యవధిలో 25 కేసులు ఈ చెన్నై యువతిపై నమోదు కాగా, నార్త్ జోన్ పరిధిలోని మారేడుపల్లి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ యువతి పేరు డేసీ. కడపకు చెందిన డేసీ తండ్రి, చెన్నైకి వెళ్లి స్థిరపడగా, డేసీకి వివాహం కూడా జరిగింది. అయితే, జల్సాలకు అలవాటు పడిన డేసీ, సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. కాలనీల్లో, సీసీ కెమెరాలు లేకుండా, ఒకే మహిళ నడుపుతూ ఉండే బ్యూటీ పార్లర్లను లక్ష్యంగా చేసుకునేది.
జనాలు పెద్దగా రాని మధ్యాహ్న సమయంలో ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వెళ్లి, పార్లర్ యజమాని ఒంటరిగా ఉంటే తన ప్లాన్ అమలు చేసేది. మేకప్ కోసం డీల్ కుదుర్చుకుని, బంగారు నగలు తీసి మేకప్ చేయాలని కోరేది. ఆపై మత్తుమందు కలిపిన మౌత్ ఫ్రెషనర్ ఇచ్చి, సమయం చూసి ఆభరణాలతో ఉడాయించేది. తమిళనాడులో ఇదే తరహాలో పలు దొంగతనాలు చేసిన డేసీ, అక్కడ నిఘా పెరగడంతో హైదరాబాద్ కు మకాం మార్చింది.
ఫిబ్రవరిలో భర్తతో కలసి వచ్చిన డేసీ, పటాన్ చెరువు సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. మధ్యాహ్నం సమయాల్లో తనకు కనిపించిన బస్సు ఎక్కి, ఎక్కడ పడితే అక్కడ దిగి, కనిపించిన బ్యూటీ పార్లర్ కు వెళ్లి, తన ప్లాన్ వర్కౌట్ అయితే, అందినంత బంగారం దోచుకుని వెళ్లేది. వాటిని విక్రయించి భర్తతో జల్సాలు చేసేది. ఆమెపై 25 కేసులు నమోదు కాగా, కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు, కొన్ని సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన డేసీ దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. ఆపై ఆరా తీసి ఆమెను అరెస్ట్ చేశారు. ఈ చోరీల్లో డేసీ భర్త పాత్రపైనా విచారణ జరుపుతున్నామని, చోరీ సొత్తు రికవరీకి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.