India: ఆఫ్గన్ బౌలర్లను ఆడుకున్నారు... భారత టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు!
- నేడు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆఫ్గనిస్థాన్
- తేలిపోయిన బౌలర్లు
- లంచ్ కి ముందే సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి మ్యాచ్ ని ఆడుతున్న ఆఫ్గనిస్థాన్ బౌలర్లను భారత బ్యాట్స్ మన్లు ఆటాడుకున్నారు. ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ ల ధాటికి ఆఫ్గన్ బౌలర్లు తేలిపోగా, లంచ్ విరామ సమయానికి 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత జట్టు 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత టెస్టు క్రికెట్ లో గతంలో ఎన్నడూ లేని ఓ రికార్డు నమోదైంది.
తొలిరోజు బ్యాటింగ్ లో లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 91 బంతులను ఎదుర్కొన్న శిఖర్, 19 ఫోర్లు, 3 సిక్సులతో 104 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో ఉన్న మురళీ విజయ్ 72 బంతులాడి 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 41 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఉదయం టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు 5.85 రన్ రేటుతో సాగుతుండగా, భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు ఆఫ్గన్ జట్టు కెప్టెన్ అస్గర్ స్టానిక్ జాయ్, ఐదుగురు బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు.