Currency notes: మొన్న గన్.. నేడు నోట్లు.. యూట్యూబ్‌లో చూసి కరెన్సీ ముద్రణ!
- నిందితుల నుంచి ప్రింటర్, కంప్యూటర్ స్వాధీనం
- రూ.70 వేల విలువైన నోట్ల ముద్రణ
- పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
ఎంటర్‌టైన్మెంట్‌కే కాదు.. నేరాలు చేసేందుకు కూడా యూట్యూబ్ బాగా ఉపకరిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో ఓ యువకుడు యూట్యూబ్ చూసి గన్ తయారు చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. తాజాగా హరియాణాలోని ఇద్దరు యువకులు యూట్యూబ్ చూసి ఏకంగా కరెన్సీనే ముద్రించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
చత్తర్‌గఢ్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల నుంచి రూ.40 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో వారు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. తాము యూట్యూబ్‌లో చూసి నోట్లను ముద్రించామని చెప్పడంతో విస్తుపోయారు. నిందితులు బ్రజ్‌లాల్, భీమ్‌రాజ్‌ల నుంచి ఓ కంప్యూటర్, ప్రింటర్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు చలామణి చేస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో మాటువేసి నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తం రూ.70 వేల విలువైన కరెన్సీని వారు ముద్రించినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.