laxmareddy: సరోజనీ దేవి ఆసుపత్రిలో.. ఐ బ్యాంకు, రూ.కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలు ప్రారంభం!
- నేత్రదానం మహా దానం
- మనం చనిపోయాక కూడా మరొకరిలో బతికే ఉంటాయి
- దక్షిణ భారత్‌లో ప్రభుత్వ వైద్య రంగంలో మొట్టమొదటి ఐ బ్యాంక్
- వివరించిన తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్‌లోని సరోజనీ దేవి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.కోటి విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైన విషయం తెలిసిందే. దానితో పాటు ఏసీ పోస్ట్-ఆపరేటివ్ వార్డును ఈ రోజు తెలంగాణ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "నేత్రదానం మహా దానం.. మనం చనిపోయాక కూడా మన నేత్రాలు మరొకరిలో బతికే ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ప్రభుత్వ వైద్య రంగంలో మొట్టమొదటి ఐ బాంక్ ని సరోజనీ ఆసుపత్రిలో లో ప్రారంభించాం. ఇది గర్వించదగ్గ విషయం.
అలాగే నేత్రాల సేకరణకు అంబులెన్స్ ఉండటం వల్ల ఎంతో ఉపయోగం. నేత్రాల సేకరణ వేగంగా చేయవచ్చు.. గతంలో కార్నియా కలెక్షన్ చేసిన 24 గంటల్లోనే దాన్ని అవసరమైన వాళ్లకు అమర్చాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు నెలల వరకు నిలువ ఉంచే వీలు ఉంటుంది. అందరూ నేత్రదానం తో పాటు అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. దేశంలో ప్రతి నిమిషానికి ఒక శిశువు కంటి చూపు కోల్పోతోంది. నేత్రదానం కోసం ఎదురు చూస్తున్న వాళ్లల్లో చిన్నారులు అధికం.
మరణిస్తోన్న వాళ్లల్లో 2 శాతం మంది నేత్ర దానం చేసినా, అంధత్వం నివారించవచ్చు. ప్రభుత్వ పరంగా సర్కార్ దవాఖానాల్లో అన్ని రకాల అభివృద్ధి చేపట్టాం. పేదలకు మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. భవిష్యత్తులోనూ ఈ ఆసుపత్రికి అవసరమైన సాయం అందిస్తాం. సరోజనీ దేవి ఆసుపత్రికి పేషంట్స్ అటెండెంట్స్ కి షెల్టర్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రముఖ పారిశ్రామిక వేత్తలు వైద్య రంగానికి సాయం ఉండాలి. కపాడియా కుటుంబానికి కృతజ్ఞతలు. ఆసుపత్రికి వాళ్ల సేవలు శ్లాఘనీయం" అని అన్నారు.