home: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త
- పీఎంఏఐ-యూ పథకంలో మార్పులు
- అర్హత పొందిన గృహాల కార్పెట్ ఏరియా 33 శాతం పెంపు
- అన్ని మధ్య తరగతి ఆదాయ వర్గాలకు ప్రయోజనాలు
ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం అఫార్డబుల్ హౌసింగ్ స్కీమ్ ప్రధాన్ మంత్రి అవాస్ యోజన-అర్బన్(పీఎంఏఐ-యూ) ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా అందులో కొన్ని మార్పులు చేసి శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద పట్టణాల్లో వడ్డీ సబ్సిడీకి అర్హత పొందిన గృహాల కార్పెట్ ఏరియాను 33 శాతం పెంచింది. అన్ని మధ్య తరగతి ఆదాయ వర్గాలు ఈ ప్రయోజనాన్ని అందుకోవచ్చు.
తాజాగా, చేసిన మార్పుల మేరకు ఈ ప్రయోజనాలతో మధ్య తరగతి గ్రూప్-1 వారి కార్పెట్ ఏరియా పరిమితి 120 నుంచి 160 చదరపు మీటర్లకు పెరిగింది. ఈ కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారు 4 శాతం వడ్డీ రాయితీలతో రూ.9 లక్షల రుణం పొందడానికి అర్హులు. అంటే వీరు 2,35,068 సబ్సిడీ అందుకోవచ్చు.
అలాగే, మధ్యతరగతి గ్రూప్-2 వర్గాల వారి కార్పెట్ ఏరియా ప్రయోజనాలు 150 చ.మీటర్ల నుంచి 200 చ.మీటర్లకు పెరిగింది. ఈ కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 3 శాతం వడ్డీ రాయితీతో రూ.12 లక్షల వరకు రుణాన్ని పొంది, రూ.2,30,156 సబ్సిడీ అందుకోవచ్చు.