dog: బతికున్న కుక్క మీద తారు పోసి.. రోడ్డు వేసిన వైనం.. ఆగ్రాలో ఘోరం!
- రోడ్డు పక్కన ఉన్న కుక్కపై రోడ్డు నిర్మాణం
- భాధతో విలవిల్లాడి ప్రాణాలు విడిచిన శునకం
- రోడ్డెక్కిన సామాజిక కార్యకర్తలు
నిద్రపోతున్న కుక్కమీద వేడిగా ఉన్న తారును పోసి రోడ్డు వేసిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్ లో జరిగింది. నిన్న రాత్రి ఈ రోడ్డు వేశారని స్థానికులు తెలిపారు. ఎంతో బాధతో కుక్క విలవిలలాడుతున్నప్పటికీ, పట్టించుకోకుండా కన్ స్ట్రక్షన్ వర్కర్లు రోడ్డు వేసే పనిని పూర్తి చేశారని చెప్పారు. చీకటిలో రోడ్డు నిర్మాణం జరిగిన నేపథ్యంలో, రోడ్డు పక్కన ఉన్న కుక్కను గమనించకపోయి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
గోవింద్ పరాషర్ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ, కొత్తగా వేసిన రోడ్డు కింద కుక్క కాళ్లు ఉండిపోయాయని, కాసేపు విలవిల్లాడిన కుక్క ఆ తర్వాత చనిపోయిందని చెప్పారు. అయితే, ఉదయానికల్లా కుక్క శవం కనిపించలేదని ఆయన మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన కుక్కకు తాను అంత్యక్రియలను నిర్వహిస్తానని, తనకు కుక్క భౌతికకాయం కావాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఘటనా స్థలికి భారీ సంఖ్యలో చేరుకున్న సామాజిక కార్యకర్తలు... రోడ్డును నిర్మిస్తున్న సంస్థ వాహనాలను కదలనీయలేదు. కుక్క ప్రాణాలను తీసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ సర్దార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. హింసకు ఇది పరాకాష్ట అని, ప్రపంచం ఎటు పోతోందని, మానవత్వం సిగ్గుతో తల వంచుకునే ఘటన అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.