Yanamala: 'రెండు సినిమాలు' అంటూ జగన్ అనడం బాధ్యతారాహిత్యం: యనమల
- పోలవరం, అమరావతిలపై జగన్ అవివేకంగా మాట్లాడారు
- రాష్ట్ర సమస్యలపై జగన్కు కనీస అవగాహన లేదు
- రాష్ట్రాలను బలహీనపరచి కేంద్రం బలపడాలని చూస్తోంది
నిన్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కోటిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలవరం, అమరావతిలను రెండు సినిమాలని అనడం బాధ్యతారాహిత్యమని అన్నారు. పోలవరం, అమరావతిపై చేసిన వ్యాఖ్యలు జగన్ అవివేకాన్ని బయటపెట్టాయని, రాష్ట్ర సమస్యలపై ఆయనకు కనీస అవగాహన లేదని రుజువైందని అన్నారు. రాష్ట్రాలను బలహీనపరచి కేంద్ర సర్కారు బలపడాలని చూస్తోందని ఆరోపించారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రం ఇచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అందులో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదని యనమల ప్రశ్నించారు. అలాగే, ప్రధానికి చేసిన వినతిలో కాపుల రిజర్వేషన్లపై ఎందుకు పేర్కొనలేదని నీలదీశారు. ఉద్దేశ పూర్వకంగానే వాటిని వదిలేశారని అన్నారు.