USA: ఆరు ఫైటర్ చాపర్లను ఇండియాకు ఇచ్చేందుకు యూఎస్ అంగీకారం!
- ఇండియాతో వ్యూహాత్మక బంధాన్ని పటిష్ఠం చేసుకునే ఆలోచనలో యూఎస్
- దక్షిణాసియాలో శాంతికి డీల్ ఉపకరిస్తుందన్న యూఎస్
- రూ. 5 వేల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఇండియాకు అమ్మాలని నిర్ణయం
సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన డీల్ లో భాగంగా 6 బోయింగ్ ఏహెచ్-64ఈ అపాచీ ఫైటర్ హెలికాఫ్టర్లను ఇండియాకు విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం పలికింది. ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక బంధాన్ని ఈ డీల్ మరింత పటిష్ఠం చేస్తుందని, అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఇండియా కోరినట్టుగా ఫైటర్ చాపర్ల డీల్ కు తాము అంగీకరించామని, దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక పురోగతికి ఇండియా ఎంతో కీలకమని, ఈ ప్రాంతంలో భద్రతను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలన్న ఆలోచనతోనే డీల్ కు ఓకే చెప్పామని పేర్కొంది.
కాగా, ఈ అపాచీ హెలికాఫ్టర్లు, ఉపరితలం నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. బోయింగ్ సంస్థ ఈ చాపర్లను తయారు చేస్తుండగా, టాటా గ్రూప్ భాగస్వామ్యంతో ఇండియాలోనూ బోయింగ్ సంస్థ ఓ హెలికాప్టర్ తయారీ యూనిట్ ను నడుపుతోంది. ఇక ఈ ఈ 6 అపాచీ హెలికాప్టర్లతో పాటు నాలుగు ఏఎన్\ఏపీజీ -78 ఫైర్ కంట్రోల్ రాడార్లు, హెల్ ఫైర్ లాంగ్ బో మిసైల్స్, స్టింగ్ బ్లాక్ మిసైల్స్, జీపీఎస్ ఇంటీరియల్ నావిగేషన్ సిస్టమ్ తదితరాలను కూడా ఇండియాకు అమ్మేందుకు యూఎస్ విదేశాంగ శాఖ పచ్చజెండా ఊపింది.