America: కిమ్ మనసు మార్చి.. అమెరికాపై ద్వేషాన్ని తగ్గించిన స్టార్ ఆటగాడు!
- అగ్రనేతలను కలిపిన ఫుట్‌బాల్ ఆటగాడు
- కిమ్ కలిసిన తొలి అమెరికన్ అతడే
- అమెరికా హెచ్చరికలనూ ఎదుర్కొన్న ప్లేయర్
అమెరికా అంటే అంతెత్తున ఎగిరిపడే ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్.. ట్రంప్‌తో సమావేశానికి ఎలా సై అన్నారు? అమెరికాపై ద్వేషాన్ని ఎలా వదులుకున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం.. డెన్నిస్ రాడ్‌మన్. అమెరికా బాస్కెట్ బాల్ చరిత్రలో ‘హాల్ ఆఫ్ ఫేమ్’గా నిలిచిపోయిన క్రీడాకారుడతడు. అమెరికాపై కిమ్‌కు ఉన్న దృక్కోణాన్ని మార్చడంలో సఫలీకృతుడయ్యాడు. ఇదెలా సాధ్యమైందంటే..
ప్రపంచంతో అంటీముట్టనట్టు ఉండే కిమ్‌కు బాస్కెట్ బాల్ అంటే పిచ్చి. 2013లో రాడ్‌మన్ ఓ టీవీ చానల్ సాయంతో ఉత్తరకొరియా వెళ్లి బాస్కెట్ బాల్ టోర్నీ నిర్వహించాడు. ఈ క్రమంలో కిమ్‌తో భేటీ అయ్యే అవకాశం రాడ్‌మన్‌కు లభించింది. కిమ్ దేశాధ్యక్షుడయ్యాక కలిసిన తొలి అమెరికన్ రాడ్‌మనే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి.
ఉత్తర కొరియా నుంచి స్వదేశం చేరుకున్న రాడ్‌మన్.. కిమ్‌కు ట్వీట్ చేస్తూ ఆ దేశంలో 15 ఏళ్లుగా బందీగా ఉన్న కెన్నెత్ బేని విడుదల చేయాలని కోరారు. రాడ్‌మన్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కిమ్ ఏడాది తర్వాత కెన్నెత్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత మరోసారి ఉత్తరకొరియా వెళ్లిన రాడ్‌మన్ ఈసారి కిమ్ కుటుంబ సభ్యులను కూడా కలిశాడు. తర్వాత ఉత్తర కొరియాతో చర్చలకు అప్పటి అధ్యక్షుడు ఒబామాను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఒబామా సర్కారు అందుకు నిరాకరించింది.
2014లో మరోసారి ఉత్తరకొరియా వెళ్లిన రాడ్‌మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పినా అమెరికా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ఉత్తర కొరియాకు ఏజెంట్‌గా మారాడని ఆరోపించింది. కిమ్ ఇచ్చిన సొమ్మును తీసుకుని చట్టాన్ని అతిక్రమించాడని ఆరోపించింది. ఈ క్రమంలో ఆయన బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు.
ఈ ఘటన తర్వాత రాడ్‌మన్.. కిమ్‌ను కలుసుకోలేదు. గతేడాది ఉత్తర కొరియా క్రీడా శాఖా మంత్రిని కలుసుకున్న ఆయన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాసిన ‘ఆర్ట్ ఆఫ్ ది డీల్’ పుస్తకాన్ని కిమ్‌కు బహుమానంగా పంపించాడు. తాజాగా చారిత్రక చర్చలకు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. అణ్వస్త్రాల నిరాయుధీకరణ చర్చల్లో ఫుట్‌బాల్ ఆటగాడు కూడా ఉండొచ్చన్న విషయం తనకు తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ7 సమావేశంలో అయితే, రాడ్‌మన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
కిమ్-ట్రంప్ భేటీ విషయం తెలిసి రాడ్‌మన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అమెరికా-ఉత్తర కొరియా ప్రజలు స్నేహంగా మెలిగేలా చేయడమే తన ముందున్న బాధ్యత అని పేర్కొంటూ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ట్రంప్ నినాదం రాసున్న టోపీని ధరించాడు.