Kim Jong Un: ట్రంప్ కు కొరియా రాదు... కిమ్ ఇంగ్లీష్ అంతంత మాత్రమే!
- దుబాసీలను నియమించిన ఇరు దేశాలూ
- ఒకరి మాటలను మరొకరికి అనువదించి చెప్పిన అధికారులు
- ఇంతవరకూ రావడం గొప్ప విషయమన్న కిమ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొరియా భాష ఒక్క ముక్క కూడా తెలియదు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు తెలిసిన ఆంగ్ల పరిజ్ఞానం అతి తక్కువ. ఇక వీరిద్దరూ ఈ ఉదయం సింగపూర్ లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తూ, తమ మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇక ఒకరు మాట్లాడిన మాటలు మరొకరికి తెలిపేందుకు దుబాసీలను (అనువాదకులు) ఇరు దేశాలూ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాయి. ఇంగ్లీష్, కొరియన్ భాషలు తెలిసిన అనువాదకులు కిమ్, ట్రంప్ మాట్లాడిన మాటలు ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పారు. 'ఈ సమావేశం ఫలప్రదం కావాలని భావిస్తున్నా' అన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కిమ్, అసలు ఇంతవరకూ రావడమే చాలా గొప్ప విషయమని, ఎన్నో అడ్డంకులను అధిగమించిన తరువాత ఈ రోజు వచ్చిందని అన్నారని తెలుస్తోంది. వీరి చర్చల అనంతరం ఎటువంటి నిర్ణయం తీసుకున్నారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.